Satyanveshana    Chapters   

సన్మానసభ

మధురకవి శ్రీ కాకాని నరసింహారావుగారు పద్య కుసుమములతో స్వాగతము పలుకగా అధ్యక్షులు తదితర ఆహుతులు సభావేదిక నలంకరించిన తరువాత శ్రీ కోట పద్మనాభంగారు ప్రార్థన చేశారు. అంత అధ్యక్షులు తను ప్రసంగంలో ఈ పండిత సభకు అధ్యక్షుడుగా నుండుటకు తమకు అర్హతలేదనియు, సన్మానసంఘమువారి కోరిక నిరాకరింపలేక అంగీకరించితిమని చెప్పి, శ్రీ మాధవరావుగారు చేసిన సారస్వతసేవను, ధర్మప్రబోధ యిత్యాది గ్రంధములందలి ఆధ్యాత్మిక భావ వివరణను కొనియాడి, మనది వేదమతమనియు, వేదములు శాస్త్రములు స్మృతులు ప్రమాణ గ్రంధములనియు అవి నిర్ణయించిన ధర్మములు విధులు అనుసరణీయములనిచెప్పి సాహిత్యసామ్రాట్‌ త్రిపుర్నేని వెంకటేశ్వరరావుగారిని సభాప్రారంభంచేయగా నిర్దేశించారు.

శ్రీ వెంకటేశ్వరరావుగారు తమకు మాధవరావుగారికి పదునైదు వత్సరములనుండియు పరిచయముకలదనియు, వారి రచనలనన్నింటిని తాము చదివితిమనియు ఆ గ్రంథములలో నున్న విమర్శనా రీతులు అత్యుత్తమ స్థాయిని నిర్మొహమాటముగ నిష్పాక్షికముగా నుండె ననియు, మాధవరావుగారు కవి యెంత గొప్పవాడైనను ఆ కవి రచనల యందు దోషములున్న వెలిబుచ్చుటకు వెనుదీయని దృధసంకల్పుడనియు చెప్పి. ఈ సత్యాన్వేషణ రచనలోగూడ ఆ నిష్పాక్షికత, నిజాయితీ కనబడుచున్నదన్నారు. అందు తమను ఆకర్షించినది, ముఖ్యముగా కార్యకారణ సంబంధము అనుపేర వారు అందందు చేసిన హేతువాదం మతమునకు ఇచ్చిన నిర్వచనము. మానవతాగుణ నిరూపణ మతమునకు కులములకు సంబంధము లేదనుట మానవులుస్వధర్మ తత్పరుల ఏలకావలయును సర్వమతముల ప్రయోజనమొకటే యనునది అని చెప్పి సత్యాన్వేషణ గ్రంథమందలి విషయ వివరణను సాకల్యముగా సమీక్షించి శ్రీ మాధవరావుగారిని గుడివాడ సారస్వతేయులు నేడు సన్మానించుట సముచితము సంతోషప్రదము అని చెప్పిరి.

అంత కవిసామ్రాట్‌ మహోపాధ్యాయ పైడిపాడి సుబ్బరామశాస్త్రిగారు గ్రంథమును ఆవిష్కరించి ఇలా అన్నారు. ''నన్ను గ్రంధావిష్కరణ చేయవని సన్మాన సంఘమువారు కోరగా, మాధవ రావుగారు ఏదో సారస్వతవిషైక గ్రంధం వ్రాసివుంటారు. అనుకొని సరే అన్నా. వారు సత్యాన్వేషణ గ్రంధం చూడమని ఇచ్చారు. అది చూచా. సాహిత్య విమర్శకులయిన మాధవరావుగారికి ఆధ్యాత్మిక విషయములందుకూడ ఇంత పరిజ్ఞానముండుటచూచి ఆశ్చర్యపడ్డా. వారికి సహజమగు సద్విమర్శనాశక్తి ఈ గ్రంధ రచనయందు ఎల్లెడ కన్పడుతోంది. నేర్పుతో యుక్తియుక్తముగా క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయముల, ధర్మనిరూపణ, ఆశ్రయ ధర్మముల కర్మభక్తి జ్ఞానమార్గముల వివరణ తేలికగ అందరికి తెలియునటులజేశారు. ఏదో సాహిత్యంలో కాలక్షేపంచేయు నేను గాక మరి ఏవేదాంతపండితుడయినా అయితే ఈ గ్రంథమందలి విషయముల చక్కగ వివరించేవారు. జిజ్ఞాసువులు చదువదగిన ఉత్తమగ్రంధము. నాకీ అవకాశము కల్పించిన సన్మాన సంఘమువారికి కృతజ్ఞుడను.

తరువాత సన్మాన సంఘ కార్యదర్శి శ్రీ జి. యస్‌. ఆర్‌. ఆంజనేయులుగారు ప్రసంగించారు. ఆ ప్రసంగములో రసోదయ సంస్థ 1958 లో మాధవరావుగారి ప్రోత్సాహామున ఒక రచయితల కో-ఆపరేటివు ప్రచురణ సంస్థగా ప్రారంభింపబడినదనియు, తామందరము యదోచితముగా దోహదము చేసితిమనియు, కాని కార్యాంతరమగ్నులగుట నేమి ఇతర కారణములచేనేమి అందరు సంస్థను మరచిపోయి నను మాధవరావుగారొక్కరు వ్యయప్రయాసలకోర్చి ఇప్పటికి పదునొకండు గ్రంథములు ప్రచురించిరనియు ఆ గ్రంధములు పండితుల విశ్వవిద్యాలయములవారి మన్ననలంది పట్టభద్ర పరీక్షలకు పాఠ్యగ్రంధ ములుగా నెన్నుకొనబడినవనియు రసోదయ దేశప్రఖ్యాతి గాంచిన దనియు దీనికంతకు మాధవరావుగారి నిస్వార్థ కార్యదీక్షయే కారణ మనియు వారు లేని సారస్వత సభలు గుడివాడలో సాధారణముగ లేవనవచ్చుననియు చెప్పి అట్టి వారిని సన్మినింప పూనుకొనిన సహృదయులు సహకరించిరని చెప్పి, మాధవరావుగారిని సన్మానింప శ్రీ గడ్డమణుగు వెంకట అప్పారావుగారిని కోరిరి. అవ్యవధిగా ఈ కార్యక్రమము తలపెట్టులచే సంకల్పించినంతగా సన్మానించలేకపోయితి మనియు చంద్రునకు ఒక నూలు పోగనునటుల చేయుచున్నామని అప్పారావుగారు శ్రీమాధవరావుగారికి గంధ తాంబూల నూతన వస్త్రముల నొసగి Purse బహూకరించిరి. శ్రీ మాధవరావుగారు శ్రీ సుబ్బరామ శాస్త్రిగారిని పూజించి నూతన వస్త్రము తొసంగిరి తమ రచనలలో కొన్నిటిని శ్రీయుతలు కోగంటి దుర్గామల్లిఖార్జునరావు, కోడూరి శ్రీరాములు, తుమ్మలపల్లి శివరావు, మల్లంపల్లి రామలింగేశ్వరశర్మ ప్రభృతులకు బహూకరించి సత్కరించిరి.

శ్రీ రావూరి వెంకటసత్యనారాయణరావుగారు తమకు మాధవరావుగారితో పాతికవత్సరముల పరిచయము కలదనియు వారు స్కూళ్ళ డిప్యూటి ఇన్‌స్పెక్టరుగా పనిచేసే రోజులలో కృష్టాపత్రిక ఆఫీసుకు వస్తూవుండేవారనియు తన ప్రోత్సాహమున 'సవ్యసాచి' అనుపేర చాల సారస్వత వ్యాసాలు పత్రికకు వ్రాసేవారనియు, విమర్శనలో నిజముగా వారు సవ్యసాచిమే యనియు, ఆ సవ్యసాచిత్వము ఈ సత్యాన్వేషణ రచనయందు కన్పడుచున్నదనియు సనాతనములైన ధర్మముల వేదవాఙ్మయమునుండి క్రోడీకరించి మారుచున్న ఈ ప్రపంచమునందలి మానవునకు సుబోధకములుగ నుండునటుల అన్వయించి రనియు, అదియే ఇప్పుడు కావలయుననియు పురాతన అలవాటుల ఆచారముల తూచా తప్పకుండి ఆచరించుట కష్టమని గ్రహించి, మానవులు దానవులుగా దిగజారక మానవులుగా మానవాతీతులు (Supermem) గా నుండుటకు మంచిబాటలు వేసిరనియు, నేటి కవులు రచయితలు స్వార్ధపరులై, ఈర్షాళులై తమ ధర్మమును విడచి మారుదారుల గమనించుట శోచనీయమనియు, అత్యుత్తమములైన మన శాస్త్ర విషయములను సుబోధకరముగా అన్వయించి సంఘమును దిద్దవలయుననియు, ఆ ప్రయత్నమునకు మార్గముజూపిన మాధవరావు గారిని అభినందించుచున్నానన్నారు.

తరువాత బ్రహ్మవిద్యా ప్రవీణ కావూరి కామేశ్వరరావుగారు తమకు మాధవరావుగారికి యేబదివత్సరములనుండి యున్న పరిచయమును చెప్పి, తాను వారికి శిష్యకోటిలోనివాడనని, మొదటినుండియు మాధవరావుగారు ఋజువర్తనులు, నిష్కపటలు, ఆస్తికులు, యధార్థముపలుకు నిర్మొహమాటస్తులనియు అట్టివారు చిరకాలమునుండి గుడివాడలో సారస్వతసేవ చేయుచు, వారు రచించిన ధర్మ ప్రబోధలోనే సూచ్యప్రాయముగా ఆధ్యాత్మిక విషయములు చర్చించారనియు, ఇప్పుడు ఈ గ్రంధములు ఈశ్వరత్వ నిరూపణ మొదలు జ్ఞానయోగము వరకు సహేతుకముగా ఆయా చిక్కుసమస్యల యుక్తియుక్తముగా సమన్వయించారన్నారు. అందుకు ముక్తి మార్గమునకు మూలహేతువులైన కర్మ భక్తి (ధ్యాన) జ్ఞానయోగముల వివరించుటలో ఆ మూడింటికి గల అవినాభావ సంబంధము, ఒకటి మరొకదానికి ఎటుల మార్గముచూపి దోహదముచేయుట మొదలగు విషయములు అది అధికార తారతమ్యమలబట్టి సాధన మార్గములెటులయినది. శాస్త్రసమ్మతముగ వివరించి జిజ్ఞాసువులకు మహోపకారం చేశారన్నారు.

సాహిత్యవిశారద వేదం రామప్రభుగారు తమ ప్రసంగంలో ఇలా అన్నారు. ''వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు, బ్రహ్మవిద్యాప్రవీణులు, పండితలుగల సభలో నేను నిలబడి శ్రీ మాధవరావుగారు రచించిన 'సత్యాన్వేషణ' గ్రంధమును గూర్చి మాటలాడుట సాహసమే శ్రీ మాధవరావుగారు నాకు పూజ్య మిత్రులు, వారితో సంభాషించుటయే ఒక విజ్ఞానోపార్జనము. వారు ఇంతకుపూర్వమే అనేక గ్రంధాలు రచించి విమర్శకావతంసులైన కావ్యతత్త్వ విశారదులు. ఈ గ్రంధమునందలి కొన్ని భాగములు చదివి వినిపించారు. కొన్ని విషయాలు వివరించారు. వీరి విమర్శనాపద్ధతి కడుమెచ్చదగినది. సారస్వత విమర్శనవలెనే ఆధ్యాత్మిక విషయవివరణగూడ, చాల ఉత్తమరీతిని సాగినది. మనము గృహస్థులము. వీరు ఆశ్రమ ధర్మములు వివరించారు. గృహాస్థు గృహస్థుగానే నిష్కామ కర్మ ప్రవృత్తిని స్వధర్మముల నెఱవేర్చుచు కర్మయోగియై. జ్ఞానయోగి యగుటకు ముక్తిగాంచుటకు అవకాశము కలదనియు, సమేతుకముగ నిరూపించుచారు, భాగవతాది గ్రంధముల నుండి శ్రీమత్‌ భగవద్గీతనుండి తమ వాదమునకు బలపఱచు విషయముల ఉల్లేఖించారు. అట్టి మాధవరావుగారిని నేడు సన్మానించుట ఎంతయు ముదావహాము.

తరువాత శ్రీయుతులు కోగంటి దుర్గామల్లికార్జునరావు, కోడూరి శ్రీరాములు, తుమ్మలపల్లి శివరావు, మల్లంపల్లి రామలింగశాస్త్రి, ప్రభృతులు అభినందన పద్యాలుచదివారు. సైనిక స్కూలు ఆధ్యాపకులు శ్రీ యన్‌. రామారావు M.A.,B.Ed., గారు పంపిన అభినందన పద్యాలు శ్రీ వేదం రామప్రభువుగారు చదివారు.

శ్రీ మాధవరావుగారు తమ సమాధానంలో ఇలా అన్నారు. నావిధిని నేను చేయుచున్నాను. అందుకు అందుట మీరు నన్ను ఎందుకు సన్మానించాలో నాకు తెలియదు. ఈ సన్మానమునకు 'సత్యాన్వేషణ' గ్రంధమును నా యీ ప్రయత్నమును మీరు ఆమోదించారని అర్ధము చెప్పుకోవాలి, మీ ఆదరాభిమానములకు కృజ్ఞుడను. భగవంతుని దయతో ఏదోరూపమున మానవసేవ చేయుటయే నా ధర్మముగా భావించుచున్నాను. పండితులు, కవులు వేదవిద్యావిధులు నన్నుగూర్చి నా రచనల గురించి ఏమో గొప్పగా చెప్పుచుంటే సిగ్గుచే కృంగిపోయాను. నా ఆజ్ఞానము, నా అసమర్థత నాకు తెలియును. ఒకమారు నా జీవితమును మొదటినుండియు పునరాలోకనచేస్తే, ఏదో ఒక మహత్తర అదృశ్యశక్తి నన్ను వెన్నంటి కాపాడుచున్నదని తోస్తుంది. ఋషి తుల్యులగు నా జననీ జనకుల ఆశీస్సులే నన్ను రక్షించుచున్నవి. నేను కష్టాలు అనుభవించాను, సుఖాలు అనుభవించాను. సజ్జనసాంగత్యం లభించింది. నా శ్రేయోఖిలాషులగు మీవంటి సన్మిత్రులున్నారు. పితౄరణము తీర్చుకొనుటకు ప్రారంభించిన కావ్యాలోకన కృతితో నేటికి తొమ్మిది గ్రంధాలు వ్రాశానంటే అదియంతయు మీ ఆదరాభిమానాలు, భగవంతుని కృపయే ఆధారము. నన్ను ఎల్లవేళల కంటికి రెప్పవలె కాపాడుచున్న ఆ పరాశక్తి ఏ గ్రంధము ఎప్పుడు ఎటుల వ్రాయువలయునో అటుల వ్రాయించాడు. ఏబది వత్సరములకు పూర్వము కవిత్వము వ్రాయాలను ఉబలాటంతో కొన్నిపద్యాలు, భావగీతాలువ్రాశా. ఇష్టదైవంగా శ్రీ బాలగోపాలమూర్తిని స్తవముచేసి కృతిభర్తగా ఎన్నుకున్నా. ఆ స్వామి నేటికి దయతో అంగీకరించాడు. ఎట్టి గ్రంధము కావాలో దానిని వ్రాయించాడు. ఆ దైవమునందు నాకు పూర్తి భక్తి విశ్వాసములు గలవు. అది మూఢ భక్తి అంటారా. అనండి, గృడ్డి నమ్మకం అంటారా అనండి. బాధలేదు. నన్ను రక్షించుచున్న ప్రోత్సహించుచున్న ఆ పరాశక్తియో నాకు అండ, రక్షణ నేను ఆస్తికుడను. నాది వేద మతము. ఇతర మతములన్నను నిరీశ్వర వాదులన్నను నాకు ద్వేషములేదు. వారిని గౌరవిస్తా. ఎవరిమార్గమువారిది. సారస్వత విషయములుగాని, ఆధ్యాత్మిక విషయములు గాని పండితులకే గాక ఆబాలగోపాలము గ్రహించునటుల చెప్పుట ప్రయోజనకరమని నా భావము. ఏకొద్ది పెద్దలో హర్షించినంతమాత్రమున మానవకోటికి ఉపకరించని వ్రాత నిష్ర్పయోజనము. మొదటినుండియు కార్యకారణ సంబంధము విచారించు స్వభావముకలవాడను అది హేతువాదము అంటారు. నాకు మూలకారణము కొన్ని యెడల తెలియరాకపోయినంత మాత్రమున తత్సంబంధమైన కార్యగౌరవమును నిరసించను. దానిని గ్రహించు తెలివితేటలు నాకు లేవని భావింతును.

గుడివాడ చరిత్ర వ్రాయవలసినదిగా అధ్యక్షులువారు ఆదేశించారు మీరందరు సహకరిస్తే అది రచిస్తాను. నేను ఈ సభ యేర్పాటుచేసిన సహృదయులకు, సారస్వతేయులకు నమోవాకములు.

ఈ గ్రంథ ముద్రణకు విరాళమిచ్చిన శ్రీ గుడ్లవల్లేటి లక్ష్మణరావుగారికి కృతజ్ఞడను. వారు నడుపుచున్న త్యాగరాజు భక్తసమాజమునకు సత్యాన్వేషణ ప్రతులు నలుబది, గుడివాడ శంకర సేవాసమితి వారికి నలుబది ప్రతులు సమర్పిస్తా. మీ అందఱికి హృదయపూర్వక వందనములు. సెలవు.

అధ్యక్షులు తమ ప్రసంగములో ఈ సభ జయప్రదంగా జరుగుటకు చాలామంది సహాయపడ్డారనియు, సత్యాన్వేషణ గ్రంథస్థ విషయములు పండితులు, కవులు బాగా వివరించారనియు ప్రశంసించి మాధవరావుగారు ఇట్టి మంచి గ్రంధాలు వ్రాయుచు ఆయురారోగ్యములతో చిరకాలముండాలని ఆశీర్వదించారు. కార్యదర్శిగారు సభలోపాల్గొన్న వారికి వందనము లర్పించారు.

సుప్రసిద్ధ సారస్వతేయులు, కవులు పండితులు విమర్శకావతంస, కావ్యతత్త్వ విశారద, శ్రీవిన్నకోట మాధవరావు విరచిత 'సత్యాన్వేషణ' గ్రంధావిష్కరణ పురస్కర సన్మాన మహోత్సవ సంభావేదికపై జేసిన.

Satyanveshana    Chapters